: తనయుడి అంధత్వం కొత్త ఆవిష్కరణకు దారి చూపింది... ఇస్రో శాస్త్రవేత్త అద్భుత కృషి!
అంధత్వం మనిషిని చాలా వాటి నుంచి దూరం చేస్తుంది. వారి కోసం బ్రయిలీ లిపి ఉన్నా అందరిలా డ్రాయింగ్ కళను అభ్యసించలేరు. పెన్సిల్ పట్టి తమ మనసులోని భావాలకు అనుగుణంగా బొమ్మలు గీయలేరు. అహ్మదాబాద్‌కు చెందిన ఇస్రో శాస్త్రవేత్త దిలీప్ భట్ కుమారుడు నికుంజ్దీ ఇదే పరిస్థితి. చూపు మందగించడంతో అతను బ్రెయిలీ లిపిలోని ఆరు చుక్కల వద్దే ఆగిపోయాడు. ఇది దిలీప్‌ను తీవ్రంగా కలిచి వేసింది. ఆ కలత లోంచి పుట్టినదే ‘ప్రాగ్య’! అంధులు కూడా డ్రాయింగ్ వేయగలిగేలా రూపొందించిన ఈ పరికరం ప్రపంచంలోనే మొట్టమొదటిది. యూఎస్ పేటెంట్తోపాటు ఎన్నో అవార్డులను ‘ప్రాగ్య’ అందుకుంది. శ్రీహరికోట, అహ్మదాబాద్‌లో సైంటిస్ట్‌గా పనిచేసిన దిలీప్ తన కుమారుడి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ పరికరాన్ని రూపొందించినట్టు చెప్పారు. మెడిసనల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన తనకున్న అనుభవంతో అతి తక్కువ కాలంలోనే దీనిని తయారుచేశారు. 1.5X1.5 అడుగులు ఉన్న చెక్క బోర్డుపై వెల్కరోను అతికిస్తారు. అనంతరం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పెన్నులో ఊలెన్ దారం ఎక్కించి మనకిష్టమైన బొమ్మలు గీసుకోవడమే. వెల్కరోపై పెన్నును మనకు నచ్చినట్టు కదపడం ద్వారా అంధులు సులభంగా బొమ్మలు గీసుకునే అవకాశం ఉంది. ఒకసారి బొమ్మ గీయడం పూర్తయిన తర్వాత వెల్కరో నుంచి ఊలెన్ దారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. భట్ భార్య పేరు 'ప్రాగ్య'. ఆ పేరునే ఈ పరికరానికి పెట్టారు. భారత్‌లోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో మారుమూల గ్రామాల స్కూళ్లలోని అంధ విద్యార్థులు ‘ప్రాగ్య’ను ఉపయోగించి తమలోని ఆర్టిస్టును బయటకు తీసుకొస్తున్నారు. భట్ కుమారుడు నికుంజ్(22) మాట్లాడుతూ భట్ తనకు తండ్రి మాత్రమే కాదని, మంచి స్నేహితుడు కూడా అని చెప్పుకొచ్చాడు. తాను అన్ని పనులు చేయగలననే ఆయన భావించేవారని పేర్కొన్నాడు. బీఏలో తనకు సంస్కృతం చెప్పేందుకు ఆయన సంస్కృతం కూడా నేర్చుకున్నారని వివరించాడు. తాను అందరిలాగా సైకిల్ తొక్కగలనని, స్టేజ్‌పై అనర్గళంగా మాట్లాడగలనని, ఇవన్నీ తనకు తండ్రే నేర్పాడని పేర్కొన్నారు. తండ్రే తన రియల్ హీరో అని కొనియాడాడు.