: భోపాల్‌లో దారుణం.. మహిళా టీచర్‌పై యాసిడ్ దాడి


బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ కాలేజ్ టీచర్‌(24)పై యాసిడ్ దాడికి పాల్పడిన దారుణ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ మీద పడడంతో 30 శాతం గాయాలైన ఆమె పై దుస్తులు తొలగించి సాయం కోసం ఏడుస్తూ దాదాపు కిలోమీటరు దూరం పరిగెత్తింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన బాధితురాలు ఇటీవలే ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజ్‌లో లెక్చరర్ గా చేరింది. దగ్గరల్లోని బస్టాప్‌కు ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మాస్క్‌లు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ గుమ్మరించారు. ఒక్కసారిగా యాసిడ్ మీద పడడంతో బాధతో అరుస్తూ అర్ధనగ్నంగా పరిగెడుతున్న ఆమెను ఓ వృద్ధురాలు గుర్తించి దుప్పటి ఇచ్చి కాపాడింది. అనంతరం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. దుండగులు ఆమెకు తెలిసిన వ్యక్తులేనని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం వారెవరో తనకు తెలియదని చెబుతోంది. దాడికి ముందు దుండగులు ఆ ప్రాంతంలో తచ్చాడినట్టు తెలుస్తోంది. బాధితురాలి మొబైల్‌ ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొందరు యువకులు ఆమెను గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారని, రెండు నెలల క్రితం ఆమె ఫోన్, బ్యాగును దొంగిలించినట్టు టీచర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News