: పక్కా ప్రణాళికతో ఆర్బీఐ గవర్నర్ తో ప్రభుత్వం రాజీనామా చేయిస్తోంది: చిదంబరం
కేంద్రం పక్కా ప్రణాళికతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవి నుంచి రఘురాం రాజన్ ను రాజీనామా చేయిస్తోందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆర్బీఐ గవర్నర్ గా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు రఘురామ్ రాజన్ విముఖత చూపించడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. అయితే ఆయన నిర్ణయం ఆశ్చర్యపరచలేదని చిదంబరం చెప్పారు. ఆధారం లేని విమర్శలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్త, విద్యావేత్తను కేంద్రం అవమానించిందని ఆయన మండిపడ్డారు. ఈ నిర్ణయం వల్ల దేశం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రఘురాం రాజన్ ను చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్బీఐ గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే.