: కాంగ్రెస్ మునుగుతున్న ఓడ... అజిత్ జోగి దానికి రంధ్రం చేశారు: రాజ్ నాథ్ సింగ్
కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నౌక లాంటిదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, అందుకే చాలా మంది నేతలు ఆ పార్టీ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కాంగ్రెస్ నౌకకు చిల్లు పెట్టారని, అది ఇప్పుడు ఆ పార్టీని పూర్తిగా ముంచేస్తుందని ఆయన తెలిపారు. మునిగిపోయే నౌకకు రంధ్రం ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా దానిని కాపాడలేదని, అలాగే కాంగ్రెస్ ను కూడా ఏ శక్తి కాపాడలేదని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు బలమైన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా బలహీనపడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే హింస సమస్యలకు పరిష్కారం కాదన్న ఆయన, మావోయిస్టులు ఆయుధాలు విడనాడి ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. మావోలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. జమ్ము, కశ్మీర్ సరిహద్దుల్లో 50 శాతం మేర చొరబాట్లు తగ్గాయని ఆయన చెప్పారు.