: రెండోసారి ఆర్బీఐ గవర్నర్ పదవి చేపట్టేందుకు రఘురాం రాజన్ విముఖత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ రెండోసారి ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. ఓపక్క బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి చేస్తున్న విమర్శలు, మరోపక్క ముందున్న సవాళ్ల నేపథ్యంలో ఆయన రెండోసారి ఆర్బీఐ గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. కాగా, రాజన్ పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. దీంతో ఆయన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని, అధ్యాపక వృత్తి చేపట్టనున్నారని సమాచారం. కాగా, సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ రఘురాం రాజన్ కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని నరేంద్ర మోదీల మద్దతు వుందని అంటారు. అయినప్పటికీ ఆయన రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు మాత్రం విముఖత వ్యక్తం చేయడం విశేషం.