: చిత్తూరు కోర్టులో పేలిన బాంబు ఉగ్రవాదులదట!.. ఎస్పీకి ఆల్- ఉమా లేఖ!


ఇటీవల చిత్తూరులోని జిల్లా కోర్టు భవనాల సముదాయంలో పేలిన బాంబులు పెను కలకలమే రేపాయి. ఆమధ్య టీడీపీ కీలక నేత కఠారి మోహన్, చిత్తూరు మేయర్ గా ఉన్న ఆయన సతీమణి అనురాధలను ఆయన మేనల్లుడు చింటూ రాయల్ పట్టపగలే దారుణంగా హత్య చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపిన ఈ హత్య కేసులో చింటూ రాయల్ ఆ తర్వాత కోర్టులో లొంగిపోయాడు. మొన్న ఏప్రిల్ 7న ఈ కేసు విచారణ నిమిత్తం అతడు కోర్టుకు వచ్చిన సమయంలోనే రెండు బాంబులు పేలాయి. ఈ పేలుడులో పెద్ద నష్టమేమీ లేకున్నా... కోర్టు ప్రాంగణంలో బాంబు పేలడంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాక చింటూనే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాంబు పేలుడు ప్లాన్ వేసి ఉంటాడని కూడా పోలీసులు అనుమానించారు. అయితే ఆ బాంబు పేలుడుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అతడు... రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు, హైకోర్టు, జిల్లా కోర్టులతో పాటు పోలీసులకు లేఖలు రాశాడు. అదే సమయంలో ఉగ్రవాద సంస్థ ఆల్- ఉమా నుంచి ఇటీవల ఓ లేఖ చిత్తూరు జిల్లా ఎస్పీకి వచ్చింది. కోర్టులో బాంబు పేల్చింది తామేనంటూ సదరు లేఖలో ఆల్- ఉమా ప్రకటించుకుంది. దీనిపై అనుమానాలు వ్యక్తం చేసిన చిత్తూరు పోలీసులు లేఖలోని విషయాలు, బాంబు పేలుడు జరిగిన వైనాన్ని సరిపోల్చి చూశారు. గతంలో 2013లో పుత్తూరులోని ఓ ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు పెను బీభత్సమే సృష్టించారు. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ తిరుపతిలోని కోర్టులో జరుగుతోంది. తమ సహచరులు కోర్టుకు వచ్చిన సందర్భంగా బాంబులు పేల్చి వారిని విడిపించుకునేందుకు ఆల్- ఉమా ఉగ్రవాదులు పథకం పన్నారు. అయితే తిరుపతి కోర్టుకు బదులు పొరపాటుగా చిత్తూరు కోర్టుకు చేరుకున్న ఉగ్రవాదులు ఆ బాంబు పేలుడుకు పాల్పడ్డారు. మరోవైపు మూడు రోజుల కిందట కేరళలోని కొల్లాం కోర్టులో చిత్తూరు కోర్టు తరహా పేలుడు ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న చిత్తూరు పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడ జరిగిన పేలుడును సాంతం పరిశీలించిన పోలీసులు చిత్తూరు తరహాలోనే పేలుడు జరిగినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాక కొల్లాం పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు అనుమానితులను కూడా వారు విచారించారు. ఈ క్రమంలో అన్ని విషయాలను పరిశీలించిన చిత్తూరు పోలీసులు కోర్టులో జరిగిన పేలుడు చింటూ పని కాదని తేల్చుకున్నారు. ఆల్- ఉమా ఉగ్రవాదులే నాడు బాంబులు పేల్చారని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News