: కేజ్రీవాల్ మీడియాను యాడ్స్ తో కొడుతున్నారు: జైట్లీ
తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను గుప్పెట్లో పెట్టుకునేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ‘యాడ్స్’ను ఉపయోగించుకుంటున్నారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ‘ఫ్రెండ్లీ’ మీడియా కోసం ఆయన పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు విషయాలపై సూటిగా స్పందించారు. ఆప్ ప్రభుత్వ హయాంలో మీడియా హౌస్ ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాకుండా ఉండేందుకు ఆయన మీడియా సంస్థలకు పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇక భారత్ కు కొరకరాని కొయ్యిగా మారిన విజయ్ మాల్యా వ్యవహారంపైనా జైట్లీ మాట్లాడారు. ప్రస్తుతం మాల్యా బ్రిటన్ లో తలదాచుకున్న సంగతి తెలిసిందే. అత్యుత్తమ ప్రమాణాలున్న బ్రిటన్ ఇలా విదేశాల నుంచి పారిపోయివచ్చిన వారికి చోటు కల్పించడం దారుణమని అన్నారు. పలు మోసాలకు పాల్పడి పారిపోయి వస్తున్న వారు తలదాచుకునేందుకు బ్రిటన్ స్వర్గ ధామంగా మారిందన్నారు. మాల్యాను భారత్ కు రప్పించి చట్టం ముందు నిలబెడతామని పేర్కొన్నారు. ఉడ్తా పంజాబ్ సినిమా వ్యవహారంతో సెన్సార్ బోర్డు పనితీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో సరికొత్త పాలసీని తీసుకురానున్నట్టు ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో రామమందిర నిర్మాణం ఎన్నికల అంశం కాబోదని జైట్లీ వివరించారు.