: మొత్తానికి సీవీ రామన్ ఊరికి వై-ఫై వచ్చింది
ప్రముఖ భౌతిక శాస్త్ర్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ఊరిలో ఎట్టకేలకు వై-ఫై సేవలు ప్రారంభం కానున్నాయి. చాలా నగరాల్లో ప్రస్తుతం వైఫై సేవలు అందుతున్నా దేశానికి నోబెల్ బహుమతి అందించి పెట్టిన శాస్త్రవేత్తలు పుట్టి పెరిగిన గ్రామాల దరికి అత్యాధునిక సాంకేతికత అందకపోవడాన్ని వరల్డ్ బ్రాడ్ బ్రాండ్ అలియన్స్(డబ్ల్యూబీఏ), మైక్రోసెన్స్ సంస్థ తీవ్రంగా పరిగణించింది. చెన్నైకి చెందిన ఈ సంస్థ వెంటనే సీవీ రామన్ జన్మస్థలమైన తంజావూర్ జిల్లాలోని పురసకూడి గ్రామంతో పాటుగా, మరో శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత ఎస్.చంద్రశేఖర్ పుట్టిన మంగుడి గ్రామంలో కూడా వైఫై సేవలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదే రోజు వరల్డ్ వైఫై డే కావడం గమనార్హం. ఈ రెండు గ్రామాల్లోని స్కూళ్లు, పంచాయతీ కార్యాలయాలు, పలు వీధుల్లో యాక్సెస్ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు మైక్రోసెన్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజిత్ సింగ్ పేర్కొన్నారు.