: నష్టాలు తగ్గకపోతే ఆర్టీసీని మూసేస్తాననడం దారుణం: షబ్బీర్ అలీ
టీఎస్ఆర్టీసీలో నష్టాలు తగ్గకపోతే...ఏకంగా సంస్థనే మూసేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ఆర్టీసీ బలోపేతానికి చర్యలు చేపట్టకుండా, సంస్థ మనుగడను దెబ్బతీసేలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో తాగునీరు దొరకకున్నా మద్యం ఏరులైపారుతోందని ఆయన మండిపడ్డారు. సంజీవయ్య పార్కులో దేశంలోనే ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరించామని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ దాని నిర్వహణను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు.