: గుజరాత్ 2002 గుల్బర్గ్ సొసైటీ నరమేధం కేసు: 11 మందికి జీవిత ఖైదు
గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న గుల్బర్గ్ సొసైటీ ఊచకోత కేసులో అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు దోషులకు ఈరోజు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న 11మందికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మిగిలిన 13మందిలో 12మందికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. మరొకరికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ విచారణ జరిపి ఘర్షణలు చెలరేగిన 14 ఏళ్ల తరువాత అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు 24మందిని దోషులుగా నిర్ధారిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, 2002లో గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో ఒక్కసారిగా 20,000 మందిపై దాడికి దిగారు. దీంట్లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సహా 69 మంది మృతి చెందారు. గుల్బర్గ్ ఊచకోత కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొంటూ గతంలో చార్జిషీటు దాఖలు చేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలోనే ఐదుగురు చనిపోయారు. మరోవ్యక్తి కనిపించకుండా పోయాడు. విచారణ ఎదుర్కుంటోన్న 66 మందిలో 24 మందిని దోషులుగా పేర్కొన్న న్యాయస్థానం మిగిలిన 36మంది నిందితులని నిర్దోషులుగా విడిచిపెట్టింది. 24 మంది దోషులకి ఈరోజు శిక్షలు ఖరారు చేసింది.