: జగన్ ధ్యాసంతా డబ్బుపైనే, సీఎం అయి మరింత దోచుకోవాలనుకుంటున్నారు: ఆనం వివేకా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కి ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం ధ్యాస ఉండబోదని, ఆయనకి కేవలం డబ్బుపైనే దృష్టి ఉంటుందని విమర్శించారు. జగన్ ఒక మానసిక రోగి అని వివేకా అన్నారు. జగన్ ఎల్లప్పుడూ 'నేను, నాది' అనే మాటలు మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనకి ఎన్నడూ 'మనది' అనే భావమే ఉండదని, 'మనది' అని ఏనాడు మాట్లాడబోరని వివేకా అన్నారు. జగన్‌కి ఉన్న అహంకారం వల్లే తన సొంతపార్టీ నేతలు ఆయనను అసహ్యించుకొని టీడీపీవైపు మొగ్గు చూపుతున్నారని ఆనం వివేకా వ్యాఖ్యానించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ తన తల్లిని సైతం ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని, ఏపీకి సీఎం అయి మరిన్ని కోట్లు దోపిడీ చేయాలని జగన్ భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.