: సినీ పితామహుడికి 'భారతరత్న' ఇవ్వాలంటున్న కుటుంబసభ్యులు


వందేళ్లు పూర్తి చేసుకుంటున్న భారతీయ సినిమాకు తొలిసారి.. 'లైట్స్, కెమెరా, యాక్షన్' పరిచయం చేసి, మొదటి మూకీ సినిమా 'రాజా హరిశ్చంద్ర'ను రూపొందించిన వ్యక్తి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈ మహనీయుడు చూపిన బాటే తదనంతరం పలు చిత్ర రాజాలు ఆవిష్కృతమయ్యేలా చేసింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న'తో ఆయనను గౌరవించాలని ఫాల్కే మనవళ్లు చంద్రశేఖర్ పుసాల్కర్, కిరణ్ ఫాల్కే కోరారు.

ముంబయిలో నివసిస్తున్న వీరు మొదటిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను గుర్తు చేసుకున్న వారు.. 1970లో ప్రభుత్వం ఒకసారి ముంబయితో పాటు పలు ప్రాంతాల్లో ఫాల్కే వర్ధంతి ఉత్సవాలు నిర్వహించిందని చెప్పారు. ఫాల్కే గౌరవార్థం ఓ స్టాంప్, కొన్నిరోడ్లు, ముంబయిలో ఫిల్మ్ సిటీ ఆయనకు అంకితం చేశారన్నారు. ఇంకా ముంబయి, నాసిక్ లో విగ్రహాలు ఏర్పాటు చేశారని అన్నారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయాన దాదాసాహెబ్ 'భారతరత్న'కు అర్హులని భావిస్తున్నామని తెలిపారు. అలాగే, 1870, ఏప్రిల్ 30న దాదాసాహెబ్ ఫాల్కే జన్మించిన నాసిక్ లో ప్రభుత్వం 'ఫిలిం ఇనిస్టిట్యూట్'ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 'హింద్-సిని జనక్షరమ్' పేరుతో ఉన్న ఫాల్కే పురాతన బంగ్లాను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

  • Loading...

More Telugu News