: ఎట్టకేలకు 58 అడుగుల ఖైరతాబాద్ గణేశుని విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం.. నేడే పూజ!
అరవయ్యేళ్ల కింద ఒక అడుగుతో మొదలైన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ విగ్రహ ప్రస్థానం, 60 అడుగుల వరకూ వెళ్లి, గత ఏడాది నుంచి ఒక్కో అడుగు తగ్గించుకొస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు 59 అడుగుల ఎత్తు, 26 ఫీట్ల వెడల్పుతో కొలువుదీరాడు. అయితే ఈసారి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం ఎత్తు తగ్గించాలని, 20 అడుగులకు మించి ఎత్తు ఉండకూడదని ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. విగ్రహం ఎత్తు 15 అడుగులు మించకూడదని హైకోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ గా పోలీసులు ఈసారికి 17 అడుగుల విగ్రహం తయారు చేసుకోవచ్చంటూ ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీకి అనుమతి ఇచ్చారు. అయితే ఖైరతాబాద్ భారీ గణపతి ఎత్తుపై ఆంక్షలను అంగీకరించే ప్రసక్తే లేదని అన్ని రాజకీయ పార్టీలు, గణేశ కమిటీ కొన్ని రోజులుగా డిమాండ్ చేశాయి. చివరకి తర్జన భర్జనల తరువాత ఈసారి గత ఏడాది కంటే ఒక్క అడుగు తగ్గించి 58 అడుగుల గణేశ్ విగ్రహాన్ని కొలువుదీరుస్తున్నామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. గణేష్ విగ్రహ నిర్మాణ పూజ ఈరోజు సాయంత్రం 5గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.