: చంద్రబాబు బాటలో కేసీఆర్!... భాగ్యనగరికి వస్తున్న పారికర్ కు విందు ఏర్పాటు చేసిన వైనం!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఓ విషయంలో ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని ప్రయోజనాలను త్వరగా పొందేందుకు ఇటీవల చంద్రబాబు విందు రాజకీయాలకు తెర తీశారు. ఇటీవల విజయవాడ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు విందు ఏర్పాటు చేసిన చంద్రబాబు... కేంద్రం నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కు హామీ పొందారు. ఇక మరో ఇద్దరు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, పోన్ రాధాకృష్ణన్ లకు కూడా చంద్రబాబు విందు ఇచ్చారు. చంద్రబాబు వ్యూహాలను ఆసక్తిగా పరిశీలిస్తున్న కేసీఆర్ కూడా తన పంథా మార్చినట్టే ఉంది. మొన్నటిదాకా కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్న ఆయన... రేపు హైదరాబాదు రానున్న రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు రాజకీయంతో కేసీఆర్ ఏ మేరకు ఫలితాలు రాబడతారో చూడాలి.