: హరారే పిచ్ పై జింబాబ్వే ఖాకీల బైక్ పై ధోనీ చక్కర్లు!
సాంతం కొత్త కుర్రాళ్లతో జింబాబ్వే టూర్ కు వెళ్లిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్ ను రెండో వన్డేకే చేజిక్కించుకుని మూడో విజయంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన మహేంద్రుడు నిన్న మ్యాచ్ కు ముందు హరారే స్టేడియంలో బైక్ పై చక్కర్లు కొట్లాడు. ధోనీ చక్కర్లు కొట్టిన బైకు మామూలు బైకు కాదు. అక్కడి పోలీసులు వాడే కవాసకీ కాంటోర్స్ 14 ఏబీఎస్ మోడల్ కు చెందినది. మ్యాచ్ కు కాస్తంత ముందుగానే గ్రౌండ్ వద్దకు చేరుకున్న ధోనీ... అక్కడ పార్క్ చేసి ఉన్న ఆ బైకును చూసి ముచ్చటపడ్డాడట. అక్కడికి సమీపంలోనే ఉన్న ఓ పోలీస్ ను అడిగి కీ తీసుకున్న ధోనీ బైక్ పై ఎక్కి మైదానంలో రౌండ్లేశాడు. బైకులంటే అమితాసక్తి కలిగి ఉన్న ధోనీ తన గ్యారేజీని బైకులతోనే నింపేశాడు. నిన్న హరారేలో తాను నడిపిన బైకు మోడల్ తన వద్ద లేకపోయినా, ఆ బైకు కంపెనీకి చెందిన బైకులు రెండు, మూడు ధోనీ వద్ద ఉన్నాయి. వాటిపై రైడింగ్ అనుభవంతోనే ధోనీ నిన్న రూ.10.50 లక్షల విలువ చేసే ఆ బైకును అతడు అలవోకగా నడిపాడు.