: నల్లడబ్బు వచ్చే ఛాన్స్ లేదు, కనీసం ఇక్కడున్న వారి డబ్బు కాపాడండి: వీహెచ్
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు మహా ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నాకు బాధితులు భారీగా హాజరయ్యారు. వారికి కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత వీ.హనుమంతరావు మద్దతు తెలిపారు. ధర్నా స్థలికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు తమ డిపాజిట్లు వెనక్కి ఇప్పించేట్లు ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై స్పందించాలని వీహెచ్ అన్నారు. అగ్రిగోల్డ్ అంశంపై కేంద్రం తక్షణమే స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. ‘బీజేపీ నేతలు నల్లడబ్బును విదేశాల నుంచి తీసుకువస్తామని చెప్పారు.. నల్లడబ్బు వచ్చే ఛాన్స్ లేదు.. కానీ, కనీసం మనదేశంలో ఉన్న వారి ఆస్తులను, డబ్బులను రక్షించాల’ని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతవరకు అకలిచావులు, రైతుల ఆత్మహత్యలే చూశాం. అగ్రిగోల్డ్ బాధితులు ఆ పరిస్థితికి చేరి బలవన్మరణాలకు పాల్పడకుండా చూడాలని ఆయన అన్నారు. వారి డబ్బులు వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు.