: బెంగళూరు ఎయిర్ పోర్టులో కలకలం... టేకాఫ్ తీసుకున్న విమానంలో నుంచి పొగలు!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎయిర్ పోర్టులో కొద్దిసేపటి క్రితం పెద్ద ప్రమాదమే తప్పింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే జెట్ ఎయిర్ వేస్ విమానంలో పొగలు వెలువడ్డాయి. దీంతో ఎయిర్ పోర్టులో పెను కలకలం రేగింది. వివరాల్లోకెళితే... 65 మంది ప్రయాణికులతో కొద్దిసేపటి క్రితం మంగళూరు బయలుదేరేందుకు జెట్ ఎయిర్ వేస్ విమానం బెంగళూరు ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే అందులో నుంచి పొగలు బయటకు వచ్చాయి. దీనిని గమనించిన ఎయిర్ పోర్టు సిబ్బంది విమానం పైలట్ ను అప్రమత్తం చేశారు. ఏటీఎస్ అధికారుల సూచనతో వేగంగా స్పందించిన పైలట్ ఆ విమానాన్ని వెనువెంటనే తిరిగి అదే ఎయిర్ పోర్టులో సురక్షితంగా దించేశాడు. విమానం ల్యాండ్ కాగానే అందులోని ప్రయాణికులను హుటాహుటిన దించేసిన అధికారులు పెను ప్రమాదాన్నే తప్పించారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ గాయాలేమీ కాలేదు. విమానంలో నుంచి పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.