: గుజరాత్ విద్యా వ్యవస్థ ఇంత అధ్వానమా?... సొంతంగా పేపర్ దిద్దుకుని 100కు 100 మార్కులేసుకున్న మొద్దబ్బాయ్!


బీహారు విద్యా వ్యవస్థలో లోపాలు అందరికీ తెలిసినవే. తాజాగా గుజరాత్ కూడా అదే దారిలో నడుస్తున్నట్టు నిరూపించే ఘటన ఇది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి హర్షాద్ సార్వియా అనే ఓ మొద్దబ్బాయ్, గుజరాత్ బోర్డు పరీక్షలు రాసి, పరీక్ష హాలులోనే రెడ్ కలర్ పెన్ తో తన ఎకనామిక్స్ పేపరును తానే దిద్దుకోవడమే కాకుండా నూటికి నూరు మార్కులేసుకున్న ఘటన కలకలం రేపింది. పరీక్షను రాసిన విద్యార్థికి వాస్తవంగా 34 మార్కులు మాత్రమే వచ్చాయని, సూపర్ వైజరుకు పేపర్ ఇచ్చే ముందు ఈ ఘటన జరిగిందని, దీనిపై కేసు పెట్టామని రాష్ట్ర సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శి జీడీ పటేల్ వెల్లడించారు. విద్యార్థి నిర్వాకాన్ని గుర్తించని టీచర్లపైనా కేసు పెట్టినట్టు వివరించారు. పేపర్ దిద్దే టీచర్లకు అనుమానం రాకుండా ఉండేందుకు మెయిన్ పేజీలో టోటల్ మార్కులను వేయకుండా హర్షాద్ జాగ్రత్త పడ్డాడని, పేపర్ దిద్దిన టీచర్, ముందూ వెనుకా చూడకుండా మార్కుల టోటల్ కూడి 100/100 వేసేశాడని చెప్పారు. హర్షాద్ కు గుజరాతీలో 13, ఇంగ్లీషులో 12, సంస్కృతంలో 4, సోషియాలజీలో 20, సైకాలజీలో 5, జియోగ్రఫీలో 35 మార్కులు మాత్రమే రావడంతో, అనుమానం వచ్చి పరిశీలించగా విషయం వెలుగుచూసిందని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారందరిపైనా కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థి తదుపరి పరీక్షలు రాయకుండా డీబార్ చేశామని పటేల్ తెలిపారు.

  • Loading...

More Telugu News