: హైదరాబాదులో రూ.100కు చేరిన కిలో టమోటా ధర!... ఢిల్లీలో కీలక మంత్రులతో జైట్లీ అత్యవసర భేటీ!
దేశంలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రధానంగా కూరగాయల ధరలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కిలో టమోటా ధర రూ.80కి చేరగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో వీటి ధర రూ.100 తాకింది. దీంతో పరిస్థితి చేజారిపోతోందన్న ఫిక్కీ హెచ్చరికతో కేంద్రంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ద్రవ్యోల్బణం... ప్రత్యేకించి కూరగాయలకు సంబంధించిన ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్ లో 2.21 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం... వచ్చే నెలనాటికి 12.94 శాతానికి చేరనుందన్న సమాచారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో ఆయన కేంద్ర కేబినెట్ లోని పలువురు కీలక మంత్రులతో నేటి మధ్యాహ్నం అత్యవసరంగా భేటీ కానున్నారు. ఈ భేటీకి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆహార, పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. అత్యంత కీలకంగా పరిగణిస్తున్న ఈ సమావేశానికి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణియన్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. నిత్యావసర ధరల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.