: పెప్సోడెంట్ తో పళ్లుతోమి, పియర్స్ తో స్నానం చేసే సూజీ... హైదరాబాద్ జూలో సహారా చీఫ్ ప్రేమగా పెంచుకున్న చింపాంజీ!
28 ఏళ్ల ఆ చింపాంజీ పేరు సుజి. ఇప్పుడు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకో తెలుసా? దాని రోజువారీ దినచర్య,అది అనుభవించే లగ్జరీ లైఫ్. ఒకప్పుడు సహారా చీఫ్ సుబ్రతా రాయ్ ప్రేమగా పెంచుకున్న ఆడ చింపాంజీయే సుజి. వన్యప్రాణ సంరక్షణ చట్టాల్లో భాగంగా, అది హైదరాబాద్ జూకు చేరగా, గతంలో సుజీ దినచర్యకు తగ్గట్టుగానే అధికారులు రాజభోగాలను కల్పించారు. పొద్దున లేవగానే పెప్సోడెంట్ టూత్ పేస్టుతో పళ్లుతోముకునే సుజీ, మరో బ్రాండ్ పేస్టును ఆఫర్ చేస్తే తీసుకోదట. ఆపై షాంపూ, పియర్స్ సబ్బుతో స్నానం తప్పనిసరి. అంతేకాదు, ఆపై కాఫీ కావాల్సిందే. అది కూడా నెస్ కెఫే అయితే, ఇష్టంగా తాగుతుంది. అప్పుడప్పుడూ బలం కోసం కాంప్లాన్ ఇచ్చినా పీకేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్, ఫ్రూట్ జాం, పళ్లు, లంచ్ లో తేనె, పళ్లు, కార్న్ ఫ్లేక్స్, జీడిపప్పు, బాదం పప్పు తదితరాలు ఉండాల్సిందే. క్యాడ్ బరీ చాక్ లెట్లను ఇష్టంగా తినే సుజీ కేవలం మినరల్ వాటర్ మాత్రమే తాగుతుంది. అదికూడా తన బాటిల్ లో పోసి ఇవ్వాల్సిందే. అంతటితో సుజీ లగ్జరీ అయిపోయిందనుకుంటున్నారా? ఇంకా ఉంది. రోజూ ఉతికి ఆరేసిన తాజా బ్లాంకెట్ కప్పుకుని పడుకునే సుజీకి, ఓ కూలర్, ఓ ఫ్యాన్, దోమలు కుట్టకుండా మస్కిటో రిపెల్లెంట్ వంటి సౌకర్యాలనూ జూ అధికారులు కల్పిస్తున్నారు. మరి సుబ్రతారాయ్ పెంచుకున్న సుజీ కదా!