: జీతం తక్కువైనా ఉద్యోగం బాగుంటే లాటరీ తగిలినా వదలబోమంటున్న భారతీయులు!


భారత ఉద్యోగులకు ఏం కావాలి? వారేం కోరుకుంటున్నారు? ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ సంస్థ అడోబ్, 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' పేరిట ఓ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమకు ఉద్యోగం నచ్చితే జీతం తక్కువైనా చేస్తామని, పెద్దమొత్తంలో డబ్బులు ఒకేసారి వచ్చి పడేలా లాటరీ తగిలినా చేస్తున్న జాబ్ వదలబోమని 98 శాతం మంది వెల్లడించడం గమనార్హం. ఇక ఇండియాలో ఉద్యోగం చేస్తున్న వారిలో 83 శాతం మంది తమ పనిని ప్రేమిస్తున్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరు, తమ జీవనం మరింత ఆనందంగా సాగాలని కోరుతూ, అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. భవిష్యత్తులో రెండు ఉద్యోగాలు చేయడమన్న విషయం సాధారణమైపోతుందని 68 శాతం మంది తెలిపారు. పనిచేస్తున్న చోట ఆనందకరమైన అంశాలేమని ప్రశ్నించగా, అత్యాధునిక టెక్నాలజీని వాడుతుండటమేనని 89 శాతం మంది, ఆహార పానీయాలు అందుబాటులో ఉండటమని 87 శాతం మంది, కార్యాలయ భవనం సౌకర్యవంతంగా ఉండటమని 86 శాతం మంది వెల్లడించారు. మరో రెండు దశాబ్దాల్లో 60 శాతానికి పైగా పనులు టెక్నాలజీ సాయంతోనే నడుస్తాయని అభిప్రాయపడ్డారు. మెరుగైన అవకాశం వస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తామని 68 శాతం మంది పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News