: రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంది: జైరాం రమేష్ పశ్చాత్తాపం
కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ రాష్ట్ర విభజనపై ఈ రోజు ఢిల్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకు భారీ మూల్యం చెల్లించుకుందని అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఆత్మహత్యాసదృశమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తప్పనిసరైందని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలమైన నేతగా ఎదిగేలా చేసిందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం కేసీఆర్ కు ఆదరణ లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ద్వారా లబ్ధి పొందిన వారు పార్టీని వీడడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. సిగ్గులేకుండా అనేకమంది పార్టీ మారుతున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ మారిన వారికి ఆత్మాభిమానం, గౌరవం లేవని ఆయన తెలిపారు. ఇప్పుడు పార్టీ మారిన వారు మళ్లీ ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆయన తెలిపారు.