: 2011లో ఆ కంపెనీలో రూ. లక్ష పెట్టుబడి పెట్టి వుంటే నేడు రూ. 72 లక్షలు అయ్యేవి!


భారత స్టాక్ మార్కెట్లో బంగారు బాతులను పట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఎన్నో అవకాశాలు చేజేతులా జారిపోతుంటాయి. దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చే కంపెనీలు అత్యధికంగా ఉన్నప్పటికీ, వాటిని గుర్తించడమే కష్టం. ఇదే సమయంలో స్వల్పకాల వ్యవధిలో ఇబ్బడిముబ్బడిగా సంపదను పెంచే కంపెనీలు కూడా ఉంటాయి. అయితే, వాటిని వేళ్లపై లెక్కించవచ్చు. "క్రమానుగుణంగా పెట్టుబడులు పెట్టేవారు నష్టపోయే అవకాశాలే స్టాక్ మార్కెట్లో ఉండవు. చరిత్ర సైతం ఇదే చెబుతోంది. 15 సంవత్సరాల ఇన్వెస్ట్ మెంట్ సైకిల్ లో నష్టపోయిన కంపెనీయే ఇండియాలో లేదు" అని కోటక్ మహీంద్రా ఎండీ, నీలేష్ షా వ్యాఖ్యానించారు. ఇక ఈటీ మార్కెట్స్ డాట్ కాం, గత ఐదేళ్లలో అద్భుత లాభాలను అందించిన కంపెనీల జాబితాను వెలికితీసింది. ఈ కంపెనీలు రహస్యంగా దాక్కున్న వజ్రాల వంటివే. ఐదేళ్ల క్రితం అంటే 2011లో ఒక లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టిన వారికి రూ. 72 లక్షల వరకూ రాబడిని అందించాయంటే, వీటి సత్తా ఏంటో ఊహించవచ్చు. ఇక అత్యధిక రాబడిని ఇచ్చిన కంపెనీల వివరాలు పరిశీలిస్తే, ప్రతి లక్ష రూపాయల పెట్టుబడికి ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ రూ. 71.32 లక్షల రాబడిని (గత వారం చివరికి) అందించింది. ఆ తరువాత అవంతీ ఫీడ్స్ రూ. 62.83 లక్షలు, 8కే మైల్స్ సాఫ్ట్ వేర్ సర్వీసెస్ రూ. 47.01 లక్షలు, కాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ రూ. 39.85 లక్షలు, అజంతా పార్మా రూ. 36.39 లక్షలు, లా ఓపాలా ఆర్జీ రూ. 33.83 లక్షలు, వేల్ స్పున్ ఇండియా రూ. 23.97 లక్షలు, మార్క్ శాన్స్ ఫార్మా రూ. 16.73 లక్షలు రాబడిని అందించాయి. రిలాక్సో ఫుట్ వేర్, గ్రాన్యూల్స్ ఇండియా, ఐచర్ మోటార్స్, కజారియా సిరామిక్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల లాభాన్ని ఇన్వెస్టర్లకు దగ్గర చేశాయి. స్టాక్ మార్కెట్ కంపెనీల పూర్వపు పనితీరు, భవిష్యత్ పనితీరు ఒకేలా ఉంటుందని చెప్పేందుకు వీల్లేకపోయినా, కాస్తంత రీసెర్చ్ తో మంచి లాభాలను అందించే ఈక్విటీలను పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News