: సీఎంను చేస్తామని చెప్పినా వద్దన్నా... ఇంత భ్రష్టు రాజకీయాలెందుకు: జానారెడ్డి
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ, కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా, ప్రత్యేక రాష్ట్రం కోసం దాన్ని వదులుకున్నానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కే జానారెడ్డి వ్యాఖ్యానించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన తరువాత, మీడియాతో మాట్లాడిన ఆయన ఫిరాయింపులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రస్థాయిలో అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని, ఇంత భ్రష్టు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన జానారెడ్డి, కేసీఆర్ తో బంగారు తెలంగాణ సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి నైతికత నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.