: 13 ఏళ్లకే పైశాచికత్వం... ట్విన్ టవర్స్ పై విమానాల దాడి చూసి ఆనందంతో గంతులేసిన ఒమర్ మతీన్... గుర్తు చేసుకున్న క్లాస్ మేట్స్!


సెప్టెంబర్ 11, 2001... అమెరికాపై అల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలతో విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించిన రోజు. ఆ సమయంలో ఫ్లోరిడాలోని ఓ హైస్కూల్ లో విద్యార్థులు భయాందోళనలతో టీవీ లైవ్ చూస్తుండగా, ఓ విద్యార్థి మాత్రం ఆనందంతో గంతులేశాడు. ఉగ్రవాదులకు శుభాకాంక్షలు చెబుతూ కేకలు పెట్టాడు. అతనే ఒమర్ మతీన్... మొన్నటి ఫ్లోరిడా గే క్లబ్ పై దాడి చేసి 50 మందికి పైగా మరణించడానికి కారకుడైన ముష్కరుడు. 9/11 వేళ, మార్టిన్ కౌంటీలో మతీన్ తో కలసి చదువుకున్న విద్యార్థులు నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తరువాత మతీన్ ఇలా యూఎస్ చరిత్రలో అతిపెద్ద సామూహిక హత్యలకు పాల్పడతాడని తామసలు ఊహించలేదని చెప్పారు. "ఆ రోజు మతీన్ చాలా ఆనందంగా ఉన్నాడు. అమెరికా మీద దాడులు ఎలా జరిగాయో నటిస్తూ చూపించాడు. బస్సులో ఇంటికి వెళుతున్న వేళ విమాన శబ్దాలు చేస్తూ, భవంతిలోకి తానే విమానాన్ని దూకించినట్టుగా నటించాడు" అని మతీన్ తో కలిసి విద్యను అభ్యసించిన రాబర్ట్ జిర్క్లే తెలిపారు. 9/11 ముందు వరకూ అతను మామూలు విద్యార్థిగానే ఉన్నాడని, తనకు దగ్గరి స్నేహితుడు కాకపోయినా, నిత్యమూ ఒకే బస్సులో ప్రయాణిస్తుండే వాళ్లమని చెప్పారు. విమానాల దాడుల తరువాత అతని వైఖరిలో మార్పును చూశామని తెలిపారు. పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆనాటి మరో విద్యార్థి సైతం మతీన్ నాటి వ్యవహార శైలిని గుర్తు చేసుకున్నాడు. మతీన్ చేస్తున్న పనులు, చేష్టలతో కొందరు విద్యార్థులు అతనితో గొడవ పడేవారని, స్కూలు అధికారులకు ఫిర్యాదు కూడా చేశారని, 9/11 ఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత అతను తమ బస్సు ఎక్కకుండా చేశారని చెప్పారు.

  • Loading...

More Telugu News