: బెజవాడలో టీడీపీ నేతపై హత్యాయత్నం... కత్తులతో విరుచుకుపడ్డ ప్రత్యర్థులు
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో నిన్న రాత్రి కత్తులు స్వైర విహారం చేశాయి. రాజకీయ ప్రేరేపిత కక్షల నేపథ్యంలో టీడీపీ నేతపై దాడికి దిగిన ప్రత్యర్థులు ఆయనను హత్య చేసేందుకు యత్నించారు. అయితే ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సదరు నేత... ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన వివరాల్లోకెళితే...కృష్ణా జిల్లా కోడూరు జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ నేత బండి శ్రీనివాస్ జిల్లా పరిషత్ కు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు ఆయనను మట్టుబెట్టేందుకు పథకం వేశారు. ఈ క్రమంలో పక్కాగా ప్లాన్ వేసుకున్న ప్రత్యర్థులు విజయవాడకు వచ్చి వెళుతున్న శ్రీనివాస్ పై కత్తులతో దాడికి దిగారు. ఓ వ్యక్తి శ్రీనివాస్ ను కదలకుండా పట్టుకోగా... మరో వ్యక్తి కత్తితో ఆయనపై విరుచుకుపడ్డాడు. ఊహించని ఈ మెరుపు దాడితో వెనువెంటనే మేల్కొన్న శ్రీనివాస్ అనుచరులు దుండగులను పట్టుకునేందుకు యత్నించారు. దీంతో వారు పరారయ్యారు. కత్తి గాట్లతో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ ను ఆయన అనుచరులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ ఆయనను పరామర్శించారు.