: మురళీ మనోహర్ జోషీ కి నిన్న అవమానం...నేడు సన్మానం: మోదీ చతురత
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాజకీయ చతురత ప్రదర్శించారు. బీజేపీ కురువృద్ధులు ఎల్.కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, యశ్వంత్ సిన్హా వంటి వారికి గతంలో ఘోర అవమానాలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం మోదీ అద్వానీ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుని బుజ్జగించిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లు ముగిసిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వికాస్ పర్వ్ ను నిర్వహిస్తున్న నేపథ్యంలో, అలహాబాద్ లో మురళీ మనోహర్ జోషీ ఉన్నప్పటికీ ఆయనను ఆహ్వానించలేదు. దీంతో బీజేపీ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై అలహాబాద్ లో ఏకంగా పోస్టర్లు కూడా వెలిశాయి. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఇది నెగిటివ్ గా మారుతుందని భావించిన బీజేపీ... దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం జోషీని ఆహ్వానించని బీజేపీ నేడు జరిగిన పరివర్తన్ ర్యాలీలో ఆయనను స్టేజీపైన కూర్చోబెట్టారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ పక్కన ఆయనను కూర్చోబెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జోషీని ప్రశంసల్లో ముంచెత్తారు. బీజేపీ నేతలు ఆయనను ఆదర్శంగా తీసుకుని పని చేయాలని దిశానిర్దేశం చేశారు.