: ముద్రగడకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవు: చిరంజీవి హెచ్చరిక


కాపు రిజర్వేషన్ ఐక్య ఉద్యమ వేదిక నేత ముద్రగడ పద్మనాభంకి ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవి హెచ్చరించారు. హైదరాబాదులో కాపు నేతలతో, వైఎస్సార్సీపీ నేతలు పార్క్ హయాత్ హోటల్ లో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ముద్రగడ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించినా, ఆయనకు ఏదైనా జరిగినా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. గతంలో ముద్రగడకు ఇచ్చిన హామీల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ప్రభుత్వం చేతలు చూపించాలని వారు స్పష్టం చేశారు. లేని పక్షంలో రెండు రోజుల తరువాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. అరెస్టు సమయంలో ముద్రగడ కుటుంబసభ్యులపై పోలీసులు దాడి చేయడాన్ని వారు ఖండించారు. గత పది రోజులలో ఏపీలో చోటుచేసుకున్న పరిస్థితులు దారుణమని ఆయన పేర్కొన్నారు. ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడను తలుపులు బద్దలు కొట్టి అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమని ఆయన అభిప్రాయపడ్డారు. ముద్రగడ భార్య, కుమారుడు, కోడలు పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయమంటే ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని వారు మండిపడ్డారు. తుని ఘటనను సమర్థించడం లేదని చెప్పిన వారు, తుని ఘటనలో ప్రభుత్వ పాత్ర ఉందని ఆరోపించారు. ముద్రగడ ఆరోగ్యం గురించి తామంతా ఆందోళన చెందుతున్నామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News