: హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై నేటి నా పర్యటన ఆరంభం మాత్రమే!: కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని రోడ్ల దుస్థితిని పరిశీలించడానికి ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ అమీర్ పేట, యూసఫ్ గూడ్, శ్రీనగర్ కాలనీ తో పాటు పలు వీధుల్లో పర్యటించారు. జలమండలి, విద్యుత్, మెట్రో అధికారులతో కలసి కేటీఆర్ పర్యటన కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మహానగరంలో పనుల్లో పారదర్శకత తీసుకొస్తామని అన్నారు. పనులు పూర్తి కావడానికి విధించిన కాలపరిమితిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఢిల్లీలో రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ కోసం అనుసరిస్తోన్న ఉత్తమ విధానాన్ని సమీక్షిస్తామని అన్నారు. హైదరాబాద్లో రోడ్లను బాగుపర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. అధికారుల పనితీరు మరింత బాగుపడాలని ఆయన అన్నారు. రోడ్ల దుస్థితిపై తాను ఈరోజు చేసిన పర్యటన ఆరంభం మాత్రమేనని, ఇతర మంత్రులు, అధికారులు రానున్న రోజుల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. రోడ్ల పరిస్థితిపై వివరణ అందించడానికి అధికారులు వారం రోజులు సమయం అడిగారని ఆయన పేర్కొన్నారు.