: ఎడ్డీ జస్టిస్ ఎక్కడ?... అద్భుతం జరగాలని ప్రార్థిస్తున్న అమెరికన్లు!
ఎడ్డీ జస్టిస్... ఓ స్వలింగ సంపర్కుడే అయినా, మనసున్న మంచి యువకుడు. ఇరుగు పొరుగుతో చక్కగా మాట్లాడుతూ, తన పనేదో తాను చేసుకువెళ్లే ఎకౌంటెంట్. ఫ్లోరిడాలోని పల్స్ గే క్లబ్బుకు తరచుగా వెళ్లే నేటి తరం ఆధునిక భావాలున్నవాడు. ప్రతి వారాంతంలానే, గత శనివారం రాత్రి క్లబ్బుకు వెళ్లాడు. దాదాపు 300 మందితో కలిసి ఆడి పాడుతుండగా, ఆ క్లబ్బుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఆ సమయంలో ఓ బాత్ రూములో దాక్కుని, తన పరిస్థితిని తల్లికి వివరించిన ఎడ్డీ జాడ ఇప్పుడు తెలియడం లేదు. ఎడ్డీ, అతని తల్లి మినాల మధ్య జరిగిన చాటింగ్ సంభాషణ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కి మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించి వేస్తోంది. కాల్పుల ఘటన జరిగి రోజున్నర గడచిపోయింది. ఇప్పటికీ ఎడ్డీ మరణించాడో లేదా తప్పించుకుని ఎక్కడైనా తలదాచుకున్నాడో తెలియని పరిస్థితి. గుర్తించిన మృతుల్లో, తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎడ్డీ లేనట్టు అధికారులు చెబుతున్నారు. లక్షలాది మంది అమెరికన్లు ఎడ్డీకి ఏమీ జరిగుండదని ఆ తల్లికి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎడ్డీ తిరిగి వస్తాడని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. అద్భుతం జరిగి అతను తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఎడ్డీ నుంచి తిరిగి ఆ తల్లికి 'నేను క్షేమమే' అంటూ మెసేజ్ రావాలని మనమూ ఆశిద్దాం.