: ఇక చేసేదేం లేదు... ఈడీ ఆటాచ్ కు ముందే చడీ చప్పుడు లేకుండా విలువైన ఆస్తులమ్మిన మాల్యా
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి, పోలీసు కేసు నమోదయ్యే సమయానికి మూడు రోజుల ముందు విదేశాలకు చెక్కేసి తప్పించుకుని, సీబీఐ నుంచి పోలీసుల వరకూ టోకరా ఇచ్చిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయమాల్యా, తాజాగా ఈడీని బురిడీ కొట్టించాడు. మాల్యా ఆస్తులను ఎటాచ్ చేయాలని ఈడీ నిర్ణయించుకోవడానికి రోజుల ముందు చడీ చప్పుడు లేకుండా రెండు విలువైన ఆస్తులను మాల్యా విక్రయించేశాడు. కూర్గ్ లోని ఆయన భవంతులను విక్రయించినట్టు తెలుసుకున్న ఈడీ నివ్వెరపోయింది. ఈ లావాదేవీకి సంబంధించిన డబ్బు సైతం ఆయనకు చేరిపోయిందని సమాచారం. కాగా, ఈడీ రూ. 1,411 కోట్ల విలువైన మాల్యా ఆస్తులను అటాచ్ చేయడానికి ముందే ఈ లావాదేవీ జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు చేసేదేమీ లేని పరిస్థితుల్లో ఈ డీల్ ఎవరి మధ్య జరిగిందన్న విషయాన్ని, డబ్బు ఆయనకు ఎలా చేరిందన్న విషయాన్ని విచారించాలని ఈడీ నిర్ణయించింది. ఈ లావాదేవీ చట్ట వ్యతిరేకమని ఈడీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆస్తులను కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.