: మరోసారి చిరిగిన నక్లెస్ రోడ్డు భారీ జెండా... అధికారుల్లో టెన్షన్!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద జెండా ఇప్పుడు అధికారులను టెన్షన్ పెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నక్లెస్ రోడ్డులో ఈ నెల 2న పతాకాన్ని ఏర్పాటు చేయగా, పది రోజుల వ్యవధిలో రెండోసారి చిరిగిపోయింది. ఎగురవేసిన పతాకం కాకుండా, మరో రెండు పతాకాలను అధికారులు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోగా, నిన్నటి భారీ గాలులకు పతాకం దెబ్బతింది. దీంతో హుటాహుటిన అధికారులు తమ వద్ద ఉన్న ఆఖరి పతాకాన్ని అమర్చారు. మరోసారి గాలి వచ్చి, పతాకం చిరిగితే ఏం చేయాలన్నదే ఇప్పుడు అధికారులను పీడిస్తున్న సమస్య. కాగా, మొత్తం ఆరు జాతీయ జెండాలను సిద్ధం చేయాలని భావించిన తెలంగాణ సర్కారు, ఖమ్మంలోని ఓ వ్యక్తికి మూడు పతాకాలకు, ముంబైలోని సారాబాయి ఫ్లాగ్ సంస్థకు మూడు పతాకాలకు ఆర్డర్ ఇచ్చారు. వీటిని సాధ్యమైనంత త్వరగా తెప్పిస్తామని అధికారులు చెప్పారు. దాదాపు 72 X 108 అడుగులు ఉన్న జెండాకు రూ. 1.15 లక్షలు ఖర్చవుతోందన్న సంగతి తెలిసిందే.