: ప్రజా సంక్షేమం కోసం 35 వేల కోట్లు ఖర్చు చేశాం: తెలంగాణ హోం మంత్రి నాయిని
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. 35 లక్షల రూపాయలతో ఆధునికీకరించిన పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ ను పునఃప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణ, మతసామరస్యం కోసం పోలీసు శాఖ అడగగానే 350 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేటాయించారని అన్నారు. అలా చేయడం వల్లే గత రెండేళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన చెప్పారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితులు ఉండేవని, ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ భయపడడం లేదని ఆయన చెప్పారు. పుష్కరాల్లో పోలీసులు అద్భుతమైన సేవలందించారని ఆయన కొనియాడారు.