: తెలంగాణకు కేంద్రం 1.16 లక్షల కోట్లిచ్చింది... దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా?: బీజేపీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగం తరువాత టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేవలం 36,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని, కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు 90 వేల కోట్ల రూపాయలను ఇచ్చినట్టు చెబుతుండడం ఆశ్చర్యకరమని తెలంగాణ మంత్రి ఈటల ఆరోపించిన సంగతి విదితమే. దీనిపై చింతల రామచంద్రారెడ్డి హైదరాబాదులో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వానికి రెండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 1.16 లక్షల కోట్ల రూపాయలిచ్చిందని అన్నారు. నేరుగా ఆర్బీఐ నుంచి 56,693 కోట్ల రూపాయలు డబ్బు రూపంలో ఇచ్చిందా? లేదా? అని ఆయన నిలదీశారు. అలాగే వివిధ సంక్షేమ కార్యక్రమాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలు అందజేసిందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబితే... దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాలు విసిరారు. అది కేసీఆర్ ఫాంహౌస్ అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కరవు నివారణకు మోదీ ప్రభుత్వం 791 కోట్ల రూపాయలను విడుదల చేస్తే అందులో కనీసం ఒక్కరూపాయినైనా రైతులకు పంచారా? అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ ను అధ్యక్షుణ్ణి చేయగలరా? అని ఆయన కేసీఆర్ కు సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో ఎన్ని రోజులు ఉన్నారో, ఫాం హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News