: సీబీఐకి సినీ నటుడు కళాభవన్ మణి మృతి కేసు
అనుమానాస్పద స్థితిలో మరణించిన మలయాళ నటుడు కళాభవన్ మణి కేసును సీబీఐకి అప్పగించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని సిఫార్సు చేస్తూ, కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు కేరళ సర్కారు లేఖ రాసింది. ఆయన మరణం వెనకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరింది. కాగా, మణి మరణించి మూడు నెలలు గడుస్తున్నా, మృతి వెనకున్న కారణం తెలియకపోవడం, పోలీసులకు ఒక్క ఆధారమూ లభించకపోవడం, మృతదేహంలో రసాయనాలు ఉన్నాయని వెల్లడి కావడంతో ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వెనుక గుర్తు తెలియని వ్యక్తుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, సీబీఐ విచారణ నిజాన్ని తేలుస్తుందని భావిస్తున్నట్టు మణి సోదరుడు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.