: నో ఆర్గ్యుమెంట్స్... నా మంచితనాన్ని దుర్వినియోగం చేస్తే సీరియస్: ఉద్యోగులకు చంద్రబాబు వార్నింగ్
అమరావతికి ఉద్యోగుల తరలింపుపై చంద్రబాబునాయుడు మరోసారి స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, ఉద్యోగుల వైఖరిని ఖండించిన ఆయన "నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇంక ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు. ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే, నేను చాలా గట్టిగా ఉంటాను. ఇన్ డిసిప్లేన్ అవుతుంది. మీకేదైనా ఉంటే మీ హెడ్డాఫీసర్ తో మాట్లాడండి. టైమ్ షెడ్యూల్ వాళ్లు ఇస్తారు. ఓవరాల్ గా ఎవరెవరు రావాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ అకామిడేషన్... అన్నీ వాళ్లు చెబుతారు తప్ప, మీరు అనవసరంగా ప్రెస్ కు వెళ్లి మాట్లాడితే మాత్రం వెరీ సీరియస్ గా తీసుకుంటాం. నా మంచితనాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటే మాత్రం మంచిదికాదు. రాజకీయనాయకుల దగ్గరికి పోవడం, పార్టీల దగ్గరికి పోవడం... ఏంటి, ఆట్లాటగా ఉందా? కరెక్ట్ కాదు. ఎందుకంటే, నేను ఒకప్పుడు చాలా కఠినంగా ఉండేవాడిని. ఇప్పుడు అందరినీ కలుపుకుపోవాలన్న ఉద్దేశంతో 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాను" అని అన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవాలని, ఎవరికైనా వ్యక్తిగత ఇబ్బందులు ఉంటే తన వద్దకు తీసుకురావాలని సూచించారు. కొత్త నగరంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అంతమాత్రాన ఉద్యోగులు ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.