: రాజ్యసభలో బలం పెంచుకున్న బీజేపీ
రాజ్యసభలో బీజేపీ బలం పుంజుకుంటోంది. కీలక బిల్లులన్నీ రాజ్యసభకు వచ్చి ఆగిపోతుండడంతో పరిష్కారం ఆలోచించిన బీజేపీ గట్టికసరత్తే చేసింది. దీంతో తాము అధికారంలో వున్న రాష్ట్రాల్లో సత్తాచాటి రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకుంది. ఉత్తర్ప్రదేశ్ లోని 11 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగగా సమాజ్ వాదీ పార్టీ 7 స్థానాలను గెలుచుకోగా, బీఎస్పీ 2 స్థానాల్లో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. రాజస్థాన్ లో నాలుగు స్థానాలకు ఎన్నిక జరగగా, అన్నింటినీ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ నుంచే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. తాజా ఫలితాలతో రాజ్యసభలో భాజపా బలం 49 నుంచి 54కి పెరగగా, రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ 64 నుంచి 57 కి పడిపోయింది. హర్యాణాలో కాంగ్రెస్ కు చెందిన 14 మంది శాసనసభ్యుల ఓట్లు చెల్లకపోవడం కలకలం రేపింది. దీంతో రాజ్యసభలో రెండు పార్టీలు నువ్వా? నేనా? అన్న రీతిలో ఉన్నాయి. ప్రస్తుతానికి సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ భవిష్యత్ లో ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.