: క్రాస్ ఓటింగ్ భయం... 7 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ సీట్లకు పోలింగ్ షురూ
రాజ్యసభలో ఖాళీ కానున్న 57 స్థానాలకు సంబంధించిన ఎన్నికల క్రతువులో కొద్దిసేపటి క్రితం కీలక ఘట్టం ప్రారంభమైంది. ఇప్పటికే 30 సీట్లకు సంబంధించిన ఎన్నికలు ఏకగ్రీవం కాగా... మిగిలిన 27 సీట్లకు పోలింగ్ తప్పలేదు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర 7 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జాబితాలోని 5 రాష్ట్రాలను మినహాయిస్తే... కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లలో జరుగుతున్న ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. కర్ణాటకకు సంబంధించి ఇప్పటికే అక్కడి ఎమ్మెల్యేల ఓట్లను కైవసం చేసుకునేందుకు పలు పార్టీలు తీవ్ర యత్నాలు చేశాయన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ఓ న్యూస్ ఛానెల్ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల భాగోతాన్ని బయటపెట్టింది. ‘‘రూ.5 కోట్లిస్తే మా ఓటు మీకే’’ అని బేరసారాలకు దిగిన ఎమ్మెల్యేల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనుండగా... ఐదుగురు అభ్యర్ధులు బరిలోకి దిగారు. దీంతో అక్కడ క్రాస్ ఓటింగ్ తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇక కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ 11 సీట్లుంటే... అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్న పరిస్థితికి భిన్నమైన వాతవరణం ఉంది. ఆయా పార్టీలు తమకు ఉన్న ఎమ్మెల్యేల బలంతో అందే సీట్లకు మాత్రమే అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే ఓ స్వతంత్ర అభ్యర్థి బరిలోకి దిగారు. ఆ అభ్యర్థికి ఏఏ పార్టీలు క్రాస్ ఓటింగ్ చేస్తాయన్న ఆసక్తి నెలకొంది.