: ఇక అయ్యవార్లకూ ఆంక్షలు... టీచర్లకు ‘జీన్స్’ను నిషేధించిన హర్యానా


‘ఖాఫ్ పంచాయతీలు’ రాజ్యమేలే హర్యానాలో అయ్యవార్లకు కూడా ఆంక్షలు తప్పడం లేదు. కళాశాల అమ్మాయిలు సెల్ ఫోన్లు వాడరాదని, జీన్స్ వేయరాదని ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలున్నాయి. తాజాగా ఏకంగా ప్రభుత్వమే ఈ తరహా ఆంక్షలను సర్కారీ ఉపాధ్యాయులకు అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు స్కూళ్లకు జీన్స్ ప్యాంట్లతో రావద్దని మనోహర్ లాల్ ఖట్టర్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులు జీన్స్ ధరించడం అంత బాగా ఉండదని ఆ ఉత్తర్వుల్లో హర్యానా ప్రాథమిక విద్య సంచాలకుడు పేర్కొన్నారు. విద్యార్థులకు ‘రోల్ మోడల్స్’గా ఉండాల్సిన ఉపాధ్యాయులు జీన్స్ లో దర్శనమివ్వడం భావ్యం కాదని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఒడిశా సహా కొన్ని రాష్ట్రాలు ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నాయని, ఈ క్రమంలోనే తమ ఉపాధ్యాయులకు కూడా డ్రెస్ కోడ్ తరహాలో జీన్స్ ను నిషేధిస్తున్నట్లు ఆ ఉత్తర్వులను ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి పీకే దాస్ వెనకేసుకొచ్చారు. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రామ్ విలాస్ శర్మను కలవనున్నట్లు హర్యానా విద్యాలయ అధ్యాపక్ సంఘ్ తెలిపింది.

  • Loading...

More Telugu News