: అమలాపురం పోలీస్ స్టేషన్లో జరిపిన ఆందోళనపై ముద్రగడ సహా పలువురిపై కేసులు
కాపులకు రిజర్వేషన్లను సాధించే క్రమంలో తునిలో జరిగిన సభలో పలువురు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించిన కేసులో చేసిన అరెస్టులకు నిరసనగా ముద్రగడ పద్మనాభం అమలాపురం పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించిన అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్రగడతో పాటు 12మంది కాపునేతలపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఆందోళనల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రిలను కించపరిచేలా వ్యాఖ్యలు, నినాదాలు చేసినందుకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు, పోలీసుల విధులకు భంగం కలిగించినందుకుగానూ ఆందోళనకారులపై కేసులు నమోదయ్యాయని సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 34మంది నిందితులని గుర్తించామని అమలాపురం పట్టణ పోలీసులు తెలిపారు. ఘటనలో రెచ్చిపోయిన మరో 150 మందిని గుర్తించే క్రమంలో వీడియోలను పరిశీలిస్తున్నారు. వీరందరిపై కేసులు నమోదయ్యాయని పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ ఈరోజు మీడియాకు తెలిపారు.