: మీరు మీడియాపై ఆంక్షలు పెట్టిన రోజులు మర్చిపోయారా..?: సోమిరెడ్డి ఆగ్రహం
తుని ఘటనలో ప్రభుత్వం పలువురిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాపునేత ముద్రగడ పద్మనాభం దీక్షకు దిగడం పట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రతిపక్షనేతలు బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి.. ముద్రగడ పక్షాన మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. గతంలో కాపుల రిజర్వేషన్ల అంశంపై ఇరువురు నేతలు ఎలా స్పందించారో ఓసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. జగన్, బొత్స, రఘువీరా లాంటి వారందరూ కుట్రను చేస్తూ కాపులను టీడీపీకి దూరం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తుని విధ్వంసం ఘటనలో పాల్గొన్న వ్యక్తులపై కేసులు పెట్టొద్దని జగన్ మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. రైళ్లు తగలబెడితే కేసు పెట్టడం తప్పా..? అని ఆయన ప్రశ్నించారు. ‘తునిలో కాపులు చేసింది ఉద్యమం కాదు.. విధ్వంసం’ అని అన్నారు. మీడియా గొంతు నొక్కేస్తున్నామని జగన్ ఆరోపిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై రాజశేఖర్ రెడ్డి అనుసరించిన తీరును జగన్ మర్చిపోయారా..? అని ఆయన ప్రశ్నించారు.