: భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ పెట్టిన ‘టైం బాంబు’ డిసెంబర్ లో పేలనుంది: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్య
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ రాజన్ పై బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాటల దాడిని కొనసాగిస్తున్నారు. రాజన్ ను మరోమారు ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగించవద్దంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రహ్మణ్యస్వామి రెండు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. తాజాగా నిన్న ట్విట్టర్ వేదికగా రాజన్ ను విమర్శిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ 2013లోనే ఓ టైం బాంబును పెట్టారని సదరు ట్వీట్ లో ఆయన ఆరోపించారు. ఆ బాంబు ఈ ఏడాది డిసెంబర్ లో బద్దలు కానుందని కూడా ఆయన డేంజర్ బెల్స్ మోగించారు. దేశీయ బ్యాంకులు విదేశాల నుంచి తీసుకున్న 24 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి రావడమే ఆ బాంబు అంటూ స్వామి పేర్కొన్నారు. బ్యాంకులు బకాయిలను చెల్లించాల్సిన సంస్థ పేరును ‘ఎఫ్. ఈ’ అంటూ పేర్కొన్న స్వామి... ఆ సంస్థ పేరును మాత్రం వివరించలేదు.