: ‘సూసైడ్ స్కీం’ పెట్టాలంటూ ప్రధానికి సలహా!... మధ్యప్రదేశ్ తహశీల్దార్ కు నోటీసులు!
సంక్షేమ పథకాల మాదిరిగానే ‘సూసైడ్ స్కీం’ పేరిట ఆత్మహత్యలకూ ఓ పథకం పెట్టండంటూ మధ్యప్రదేశ్ కు చెందిన ఓ తహశీల్దార్ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆ తహశీల్దార్ చిక్కుల్లో పడ్డారు. వివరాల్లోకెళితే... మధ్యప్రదేశ్ లోని రాట్లం జిల్లా రావోటి మండలానికి తహశీల్దార్ గా పనిచేస్తున్న అమితా సింగ్ తన ఫేస్ బుక్ పేజీ లో ‘సూసైడ్ స్కీం’ పెట్టాలని ప్రధానికి ఓ రిక్వెస్ట్ పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. దీంతో కాస్త ఆలస్యంగా విషయం తెలుసుకున్న రాట్లం జిల్లా ఇన్ చార్జీ కలెక్టర్ హర్జీందర్ సింగ్ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి వెల్లువెత్తిన మద్దతును జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె సదరు ప్రతిపాదన చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు చెప్పుకుంటూ మాయగాళ్లుగా మారిన లౌకికవాదులకు ఈ స్కీంను వర్తింపజేయాలని కాస్తంత వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన అమితా సింగ్.. ఆ పథకానికి ‘రాజీవ్ గాంధీ ఆత్మహత్య యోజన’ పేరు పెట్టాలని కూడా సూచించారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ తర్వాత అమితా సింగ్ సదరు పోస్టును తన ఫేస్ బుక్ పేజీ నుంచి డిలీట్ చేశారు.