: ఏమీ చేయని వైఎస్ దేవుడా?... అన్నీ చేస్తున్న నేను దుర్మార్గుడినా?: ముద్రగడపై చంద్రబాబు ఫైర్
ఆమరణ దీక్షకు దిగిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యవహార సరళిపై టీడీపీ అధినేత. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి ఉదయం కడపలో మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన ముద్రగడ తీరును ఎండగట్టారు. కాపులకు రిజర్వేషన్లపై ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జస్టిస్ మంజునాధ కమిషన్ ను వేసి అధ్యయనం చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ‘‘కాపులకు ఏమీ చేయని వైఎస్ ముద్రగడకు దేవుడిగా కనిపిస్తున్నారు. అన్నీ చేస్తున్న మేం మాత్రం ఆయనకు దుర్మార్గులుగా కనిపిస్తున్నామా? పోలీసు వ్యవస్థపైనే తిరుగుబాటు చేస్తే... ఎవరి ఆస్తులకు ఎవరు బాధ్యత వహిస్తారు? కాపు రిజర్వేషన్లపై అధ్యయనం కోసం ఇప్పటికే కమిషన్ వేశాం. కాపుల ఆర్థిక అభివృద్ది కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. నిధులు కూడా కేటాయించాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.