: విజయంతో ముగిసిన మోదీ విదేశీ పర్యటన!... మెక్సికో నుంచి భారత్ కు తిరుగు పయనం
అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ) సభ్యత్వం కోసం వివిధ దేశాల మద్దతు కూడగట్టేందుకు ఐదు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం విజయగర్వంతో తిరుగుపయనమయ్యారు. అమెరికాలో పర్యటనను ముగించుకుని మెక్సికోలో అడుగుపెట్టిన మోదీ... ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం తమకు మద్దతివ్వాలన్న మోదీ అభ్యర్థనకు ఎన్రిక్ సానుకూలంగా స్పందించారు. భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా మద్దతుతో పాటు మెక్సికో మద్దతును కూడా కూడగట్టిన మోదీ విజయ దరహాసంతో మెక్సికో సిటీలో తిరుగు ప్రయాణానికి విమానం ఎక్కేశారు.