: సీఐడీ వాళ్లొస్తేనే... లేదంటే అరెస్ట్ కాను!: ఖాకీలకు తేల్చిచెప్పిన ముద్రగడ
తూర్పు గోదావరి జిల్లా పోలీసులపై కొద్దిసేపటి క్రితం కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ఆమరణ దీక్ష చేపట్టిన తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో ఆయన తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ నెరవేరని నేపథ్యంలో నేటి ఉదయం కిర్లంపూడిలోని తన ఇంటిలోనే దీక్షకు దిగిన ముద్రగడ లోపలి నుంచి తలుపులు బిగించుకున్నారు. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులకు కాపు యువకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ముద్రగడ ఇంటి ముందు అడ్డుగోడగా నిలబడ్డ కాపు నేతల వలయాన్ని ఎలాగోలా దాటుకుని వచ్చిన పోలీసులు ముద్రగడతో మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ చేతిలో పురుగుల మందు డబ్బాను చేతబట్టుకుని కిటికీ వద్దకు వచ్చిన ముద్రగడ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను అరెస్ట్ చేయడానికి మీరెవరు? నాపై కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులను రమ్మనండి. అయినా అమలాపురంలో నమోదైన కేసులో నేను అరెస్టయ్యే సమస్యే లేదు. తుని ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తే చెప్పండి. ఆ కేసులో అయితేనే నేను అరెస్టవుతా. ముందు మీరు ఇక్కడి నుంచి వెనక్కెళ్లండి. అవసరమనుకుంటే సీఐడీ పోలీసులను రమ్మనండి’’ అంటూ ముద్రగడ కేకలేయడంతో పోలీసులు షాక్ తిన్నారు. అంతేకాక ముద్రగడ చేతిలోని పురుగుల మందు డబ్బాను చూసిన పోలీసులకు ఏం చేయాలో పాలుపోక నోట మాట రాలేదు.