: ముద్రగడ ఇంటిలోకి పోలీసులకు నో ఎంట్రీ!... గేటు ముందు అడ్డుగోడగా కాపు నేతలు!
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయడంతో పాటు అరెస్ట్ చేసిన కాపు యువకులను విడుదల చేయాలంటూ ముద్రగడ చేసిన డిమాండ్ కు ప్రభుత్వం ససేమిరా అంది. దీంతో మరికాసేపట్లో ముద్రగడ నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు. ముద్రగడ దీక్షను నిలువరించే క్రమంలో కిర్లంపూడికి బయటి వారి ప్రవేశాన్ని పోలీసులు నిషేధించారు. అంతేకాక ముద్రగడ ఇంటిలోకి వెళ్లేందుకు కొద్దిసేపటి క్రితం పోలీసులు యత్నించారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న కాపు నేతలు పోలీసులను అడ్డుకున్నారు. ముద్రగడ ఇంటి గేటు ముందు ఓ గోడలా నిలబడ్డ కాపు నేతలు... పోలీసులను లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.