: చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు.. నగరిలో పోలీసులకి రోజా ఫిర్యాదు
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోన్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. చిత్తూరు నగరి నియోజకవర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ అక్కడి పోలీస్ స్టేషన్‌లో రోజా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పాలన అంతా పూర్తి నిర్లక్ష్య ధోరణితో కొనసాగుతోందని ఆమె దుయ్యబట్టారు. మరోవైపు తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు పాలనపై ఫిర్యాదు చేశారు. ప్రజలను దారుణంగా మోసగిస్తోన్న చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ ఆయన పోలీసులని కోరారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, బంగారు పాల్యెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ చంద్రబాబు పాలనపై పోలీస్ట్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.