: సాకర్ దిగ్గజం రొనాల్డో తనకు తానే బెస్ట్ అనుకుంటాడు...నేను కూడా అంతే!: స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్
సాకర్ దిగ్గజాలు రొనాల్డో, ఇబ్రహిమోవిచ్ లకు తాను ఏమాత్రం తీసిపోనని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ అన్నాడు. ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘సిక్స్ మెషీన్’లో చెప్పాడు. అందరూ రొనాల్డోనే గొప్ప అని అనరని, కొంతమంది మెస్సీ వైపు కూడా ఉంటారని అన్నాడు. రొనాల్డో మాత్రం తనకు తానే బెస్ట్ అనుకుంటాడని, తాను కూడా అలాంటి వాడినేనని ఆ ఆత్మకథలో రాసుకున్నాడు. గేల్ తాను సాధించిన రికార్డుల గురించి కూడా అందులో ప్రస్తావించాడు. రికార్డుల కోసం తాను తాపత్రయపడనని, వాటంతట అవే వస్తాయని అన్నాడు. అయితే, రికార్డుల కోసమే తాపత్రయపడేవారు లేకపోలేదని, వారు ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుంటారని అన్నాడు. ఒత్తిడిలో కూడా ఒక క్రీడాకారుడిని రాణించేలా చేసేది ఆత్మవిశ్వాసమేనని, అంకితభావం, కష్టపడేతత్వంతో అది సాధ్యమవుతుందని గేల్ అన్నాడు.