: చెన్నైలో మెగాస్టార్ చిత్రానికి భారీ జైలు సెట్!... నేషనల్ మీడియాలో ఆసక్తికర కథనాలు!
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రాజకీయాలకు కాస్తంత విశ్రాంతి ఇచ్చి తన 150వ చిత్రం షూటింగ్ పై దృష్టి సారించారు. తన కొడుకు రాంచరణ్ తేజ్ కొత్తగా ఏర్పాటు చేసిన చిత్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి జాతీయ మీడియా ఆసక్తికర కథనాలను రాస్తోంది. ఈ మేరకు ‘జీ న్యూస్’లో నేడు ప్రచురితమైన ఓ కథనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ కథనం ప్రకారం... ‘కత్తిలాంటోడు’ పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి జైలు నుంచి పరారవుతారట. ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ చెన్నైలో ఓ భారీ జైలు సెట్ వేస్తోంది. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ జైలు సెట్ లో జరగనున్న షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ చిత్రానికి రీమేక్.